యువగళం వాలంటీర్లపై దాడి..పోలీసుల అదుపులో 50 మంది వాలంటీర్లు

స్టేషన్ లో కాకుండా వైఎస్‌ఆర్‌సిపి నేత ఫ్యాక్టరీలో బంధించిన వైనం

yuvagalam-volunteer-arrested-by-ap-police

అమరావతిః పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతున్న యువగళం పాదయాత్ర మంగళవారం ఉద్రిక్తంగా మారింది. వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తల రాళ్ల దాడితో టిడిపి నేతలకు, పలువురు కార్యకర్తలు, వాలంటీర్లకు గాయాలయ్యాయి. తమపై దాడి జరుగుతున్నా కూడా పోలీసులు కూడా వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలకే అండగా నిలబడ్డారని టిడిపి నేతలు ఆరోపించారు. మంగళవారం అర్ధరాత్రి ప్రాంతంలో యువగళం క్యాంప్ సైట్ పై పోలీసులు దాడి చేశారు. నిద్రిస్తున్న వాలంటీర్లు, కిచెన్ సిబ్బంది సహా మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. మూడు వాహనాల్లో వచ్చిన పోలీసులు.. యువగళం వాలంటీర్లను అక్కడి నుంచి తరలించారు. రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పి ఉదయం సిసిలీలోని రాజ్యలక్ష్మి మెరైన్ ఎక్స్ పోర్ట్స్ ఫ్యాక్టరీలో బంధించారు.

రాత్రంతా రోడ్లపై తిప్పుతూ పోలీసులు తమపై విచక్షణా రహితంగా దాడి చేశారని యువగళం వాలంటీర్లు ఆరోపించారు. భీమవరం, నర్సాపురం, వీరవాసరం పోలీస్ స్టేషన్లకు తిప్పారని వివరించారు. తమపై రాళ్ల దాడికి పాల్పడ్డ వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలను కాకుండా.. రాళ్ల దాడిలో దెబ్బలు తిన్న తమనే అరెస్టు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, తమ అదుపులో ఉన్న యువగళం వాలంటీర్లపై 307 సెక్షన్ (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అనుమతించాకే యాత్ర చేపట్టగా.. వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలతో కవ్వింపు చర్యలు చేపట్టి, ఇప్పుడు వాలంటీర్లను అరెస్టులు చేశారని మండిపడ్డారు.