కరోనా పై కేంద్రం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం.. అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు సూచన

Center high level review meeting on Corona… advice to states to be alert

న్యూఢిల్లీః దేశంలో గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్త వేరియంట్ జెన్.1తోపాటు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్‌ కేసుల పెరుగుదల, మరణాలపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించింది.

ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ.. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసుల పెరుగుదల, ఆసుపత్రుల్లో వైద్య సేవల సంసిద్ధతపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్య సదుపాయాల కల్పన, అంటువ్యాధుల నివారణ చర్యలపై ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

ఈ సందర్భంగా మన్‌సుఖ్‌ మాండవీయ మాట్లాడుతూ.. దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు సమకూర్చుకోవాలని సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో ప్రతి 3 నెలలకోసారి మాక్‌డ్రిల్స్‌ వంటివి నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రాలకు కేంద్రం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

మరోవైపు 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 341 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో అధికంగా కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 24 గంటల వ్యవధిలో 292 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,311కి పెరిగింది. ఇక 24 గంటల్లో మొత్తం మూడు మరణాలు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మృతి చెందారు.