ఆర్థిక శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందిః హరీశ్‌రావు

harish-rao-reaction-in-assembly-session-on-telangana-economy-white-paper-released-by-congress-government

హైదరాబాద్‌ః తెలంగాణ కంటే 22 రాష్ట్రాలు అప్పు ఎక్కువ తీసుకున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ అప్పులపై హరీష్‌ రావు మాట్లాడుతూ…తెలంగాణ కంటే 22 రాష్ట్రాల్లో అప్పు ఎక్కువ తీసుకున్నాయి…రాజస్థాన్.. 5.37 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. కర్ణాటక కూడా 5 లక్షల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. బిఆర్‌ఎస్‌ హయాంలో ఆస్తుల కల్పన చేశామని..ప్రజలను తప్పుదారి పట్టించేలా శ్వేత పత్రం ఉందని వివరించారు. బిఆర్‌ఎస్‌ హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో అధ్భుత ప్రగతి సాధించామన్నారు. కాంగ్రెస్‌ వాళ్లకు కన్వినెంట్ గా తయారు చేసుకున్నారు. అప్పులు కొలిచే విధానం ఫాలో కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారని మండిపడ్డారు. శ్వేతపత్రంలో వివరాలు తప్పుల తడకగా ఉన్నాయి.. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోంది.. శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు తప్పు అన్నారు హరీష్ రావు.

నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారని హరీశ్ రావు అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని కోరారు. ప్రజలే కేంద్రంగా కాంగ్రెస్‌ పాలన కొనసాగించాలని సూచించారు. “శ్వేత పత్రంలో ప్రజలు.. ప్రగతి కోణం లేదు. రాజకీయ ప్రత్యర్థులపై దాడి.. వాస్తవాల వక్రీకరణే ఉంది. శ్వేతపత్రాన్ని తెలంగాణ అధికారులు తయారు చేయలేదు. ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్‌ కమిటీ వేయండి. సస్పెండ్‌ అయిన ఆంధ్రా అధికారులతో తప్పుడు నివేదికలు తయారు చేయించారు. రాష్ట్ర ఆదాయాన్ని ఆంధ్రాలో ఖర్చు చేశారని అప్పట్లో అనేక కమిటీలు తెలిపాయి. తెలంగాణ నిధులు రాష్ట్రంలోనే ఖర్చు చేయాలన్నదే పెద్ద మనుషుల ఒప్పందం. పెద్ద మనుషుల ఒప్పందం అమలు చేయకపోవడం వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ నిధులు విషయంలో అప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చాలా కమిటీలు వేశాయి. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక ఆంధ్రా అధికారులతో నివేదిక తయారు చేయించారు. సీఎం పాత గురువు పాత శిష్యులు ఈ నివేదిక తయారు చేయించారు. కావాలంటే వారి పేర్లు చెబుతా. ఆధారాలు కూడా బయటపెడతా. తమకు అనుకూలమైన వాదనలతోనే నివేదిక తయారు చేయించారు.” అని హరీశ్ రావు మండిపడ్డారు.