అమెరికాలో కొవాగ్జిన్ కు క్లినికల్ ట్రయల్స్

అమెరికాలో కొవాగ్జిన్ అనుమతులకు భారత్ బయోటెక్ దరఖాస్తు

వాషింగ్టన్: భారత్ బయోటెక్ అమెరికాలోనూ తన వ్యాక్సిన్ ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కొవాగ్జిన్ కు అనుమతి కోరుతూ అమెరికా ప్రభుత్వానికి భారత్ బయోటెక్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తుకు మద్దతుగా కొవాగ్జిన్ కు అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని భారత్ బయోటెక్ నిర్ణయించుకుంది. కొవాగ్జిన్ మార్కెటింగ్ అనుమతుల దరఖాస్తు ఆధారంగా అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ చేపడుతున్నట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. డేటా జనరేషన్, సమాచార పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.

భారత్ లో కొవాగ్జిన్ పరిశోధనాత్మక అధ్యయనంపై సమాచారం పంచుకున్నామని పేర్కొంది. 1,2,3 దశల క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని ఇప్పటికే అందజేశామని తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ వివరాలను నియంత్రణ సంస్థలు పరిశీలించాయని భారత్ బయోటెక్ వివరించింది. టీకా భద్రత, సమర్థతపై 9 పరిశోధనాత్మక అధ్యయనాలు జరిపినట్టు వెల్లడించింది. భారత్ లో క్లినికల్ ట్రయల్స్ డేటా పంచుకున్న వ్యాక్సిన్ తమదొక్కటేనని స్పష్టం చేసింది. భారతీయులపై వ్యాక్సిన్ సమర్థత వివరాలు పంచుకున్న తొలి సంస్థ తమదేనని పేర్కొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/