వైఎస్ భారతికి చేదు అనుభవం

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతికి చేదు అనుభవం ఎదురైంది. మరో రెండు వారాల్లో ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ భార్య..వైఎస్ భారతి సైతం ఎన్నికల ప్రచారం చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు సొంత నేత నుండే చేదు అనుభవం ఎదురైంది.

పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండలం కుమ్మరాపల్లె భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టదారు పాసుపుస్తకాల్లో సీఎం ఫోటో అంశంపై భారతిని వైసీపీ నేత భాస్కర్ రెడ్డి నిలదీశారు. భూముల పట్టాదారు పాసు పుస్తకాలపై సీఎం జగన్ రెడ్డి ఫోటో వేసుకోవడం తప్పంటూ సీఎం సతీమణికి వైసీపీ నేత తెలిపారు. తాతల కాలం నుంచి రైతుల సొంత భూముల పట్టాదారు పాసు పుస్తకాలపై ఆ రైతుల ఫోటోలు మాత్రమే ఉండాలని భారతికి భాస్కర్ రెడ్డి సూచించారు. జగన్ రెడ్డి ‘‘నా ఎస్సీ.. నా బీసీ.. నా మైనారిటీ’’ అంటున్నారు తప్ప నా రైతన్న అని అనడం లేదని వైసీపీ నేత ప్రశ్నించారు. రైతు భరోసా క్రింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.16 వేలలో సగం సొమ్ము కేంద్ర ప్రభుత్వానిదే అని ఆయన వెల్లడించారు. ‘‘నేను చెప్పిన సమస్యలను ఆయన సతీమణిగా జగన్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయాలి’’ అని భారతిని భాస్కర్‌రెడ్డి కోరారు. కానీ ఆమె మాత్రమే ఏ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది.