శ్రీవారి దర్శనానికి అమరావతి రైతులకు అనుమతి

మొత్తం 500 మంది రైతులు శ్రీవారిని దర్శించుకోవచ్చన్న టీటీడీ

తిరుపతి: అమరావతి రైతులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిని ఇచ్చింది. రేపు ఒక్కరోజే మొత్తం 500 మంది రైతులు స్వామివారి దర్శనం చేసుకోవచ్చని తెలిపింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో అమరావతి రైతులు మహాపాదయాత్రను చేపట్టారు. నవంబర్ 1న వీరి యాత్ర తుళ్లూరు నుంచి ప్రారంభమైంది.

ఈ రోజు వీరి యాత్ర 44వ రోజుకు చేరుకుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మొత్తం 400 కిలోమీటర్లకు పైగా వీరి యాత్ర కొనసాగింది. ప్రస్తుతం తిరుపతిలో వీరి యాత్ర కొనసాగుతోంది. ఈ సాయంత్రం అలిపిరి వద్ద వీరి పాదయాత్ర ముగియనుంది. రేపు వీరంతా శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. ఈ నెల 17న తిరుపతిలో అమరావతి రైతులు బహిరంగసభను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సభకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ వీరు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/