నిమ్స్‌లో రేపు కొత్త భవనానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

కేసీఆర్ ప్రభుత్వం వైద్యం ఫై ప్రత్యేక ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందేలా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా రేపు బుధువారం నిమ్స్‌లో కొత్త భవనానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.1,571 కోట్ల అంచనా వ్యయంతో మరో రెండు వేల పడకల హాస్పటల్ ను నిర్మించనున్నారు.

ప్రస్తుతం నిమ్స్‌కు 1,300 పడకల ఆసుపత్రి ఉన్నది. దీనికి అదనంగా ఇప్పుడు భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇది పూర్తి అయితే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి భవనంగా రికార్డు సృష్టిస్తుందని అధికారులు తెలిపారు. భవనంతో పాటు పార్కింగ్ సౌకర్యం, పచ్చదనానికి పెద్ద పీట వేయనున్నారు. భవన నిర్మాణ బాధ్యతలను సర్కారు ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించింది. నూతన భవన సముదాయంలో కొత్తగా 4 బ్లాక్‌లు అందుబాటులోకి రానుండగా.. అందులో ఓపీ సేవల కోసం ఒకటి, ఐపీ సేవల కోసం రెండు బ్లాక్‌లు, ఎమర్జెన్సీ సేవల కోసం మరో బ్లాక్ అందుబాటులోకి రానున్నాయి. 120 ఓపీ గదులు, సహా 1200 ఆక్సిజన్ బెడ్‌లు, 500 ఐసీయూ పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే.. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం నిమ్స్‌లో లేని వైద్య విభాగాలు కూడా కొత్త భవంతి నిర్మాణ పూర్తయ్యాక అందుబాటులోకి రానున్నాయి.