చంద్రబాబు రకరకాల విన్యాసాలను ప్రదర్శిస్తుంటారుః సజ్జల

వైఎస్‌ఆర్‌సిపికి 80 శాతం మంది ప్రజల మద్దతు ఉందని వెల్లడి

sajjala ramakrishna reddy
sajjala ramakrishna reddy

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు ఎంతమందినైనా లోబరుచుకోగల నేర్పరి అని, వారి దగ్గర రకరకాల విన్యాసాలను ప్రదర్శిస్తారని అన్నారు. ఎన్టీఆర్ ని తప్పించి టిడిపిని చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచీ ప్రతి ఎన్నికల్లో ఆయన ఇలాగే చేస్తున్నారని విమర్శించారు. ఒక్కో ఎన్నికలో ఒక్కో విధంగా చేస్తారని… వీటిని ఎత్తులు, వ్యూహాలు అని చెపుతుంటారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇవి అవసరమని చెపుతారని ఎద్దేవా చేశారు. ఇది నిజంగా ఒక విధమైన రోగ లక్షణమని చెప్పారు.

ప్రజల్లో సీఎం జగన్ కు ఆదరణ లేదని చంద్రబాబు చెపుతున్నారని… అలాంటప్పుడు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని సజ్జల ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సిపికి 80 శాతం మంది ప్రజల మద్దతు ఉందని… అందరూ కట్టకట్టుకుని వచ్చినా జగన్ కు సీట్లు పెరుగుతాయని అన్నారు. ఏపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయని… అవి కేంద్రం, రాష్ట్రం మధ్య ఉండే సంబంధాలేనని చెప్పారు. బిజెపికి, వైఎస్‌ఆర్‌సిపికి మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో ఎవరు ఉన్నా జగన్ ను గౌరవిస్తారని అన్నారు. బాబు అంచనా వేసిన స్థాయిలో నారా లోకేశ్ ఎదగలేకపోయారని… అందుకే లోకేశ్ ను ముందుకు తీసుకొచ్చేందుకు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు.