మరోసారి మోడీ దగ్గర ప్రత్యేక హోదా అంశం తీసుకొచ్చిన సీఎం జగన్

ప్రధాని మోడీ వద్ద మరోసారి సీఎం జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొచ్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీకి వచ్చిన ప్రధాని మోడీ.. రూ.10,742 కోట్లతో చేప‌ట్టిన‌ వివిధ ప్రాజెక్టులకు ప్ర‌ధానిమోడీ , ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో క‌లిసి శంకుస్థాపన చేశారు. అలాగే ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ..విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలి అని ప్రధాని మోడీకి విశాఖ సభ వేదికలో విన్నవించారు. ఇంటింటా ఆత్మవిశ్వాసం నింపడానికి.. కేంద్ర నుంచి వచ్చే నిధుల్లో ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తున్నామని జగన్ అన్నారు. ఏపీలో వనరులు, బడ్జెట్‭కి అనుగుణంగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఏపీకి ఇచ్చే ప్రతి సంస్థ, అదనంగా ఇచ్చే రూపాయి బాగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.

ప్రజల ప్రభుత్వంగా గడిచిన మూడున్నర సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో పిల్లల చదువులు అయితేనేమి, ప్రజలందరికీ వైద్య ఆరోగ్యం అయితేనేమి, రైతులు సంక్షేమం, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమంతో పాటు అభివృద్ధి, పరిపాలన, ఈ రెండింటి వికేంద్రీకరణ, పారదర్శకత, గడపవద్దకే పరిపాలన ఇలా.. ఈ మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో మా ప్రాధాన్యతలుగా అడుగులు వేశాం. ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలదొక్కుకోవడం అంటే ఈ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి ఇంట ప్రతి ఒక్క కుటుంబం నిలదొక్కుకోవడం అని నమ్మి, ఇంటింటా ఆత్మ విశ్వాసాన్ని నింపడానికి మా ఆర్ధిక వనరుల్లో ప్రతి రూపాయి సద్వినియోగం చేశాం అని చెప్పుకొచ్చారు.

తమ ప్రజలు ప్రేమను మాత్రం గుర్తు పెట్టుకుంటారని జగన్ అన్నారు. తమకు… రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా ఉండదని స్పష్టం చేశారు. పెద్దమనస్సుతో మీరు చూపే ప్రేమను ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి రైల్వే జోన్‌ వరకు పలు అంశాలపై విజ్ఞప్తి చేశామన్న సీఎం.. రాష్ట్ర విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.