రైలు ప్రమాద బాధితుల కోసం..గొప్ప మనసు చాటుకున్న చాహల్

ఒడిశా రైలు ప్రమాద ఘటన యావత్ ప్రజలను శోకసంద్రంలో పడేసిన సంగతి తెలిసిందే. పది , కాదు వంద కాదు ఏకంగా ఈ ప్రమాదంలో 278 మంది మృతి చెందారు. వెయ్యికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఇప్పటికీ 101 మంది మృత దేహాలు ఎవరివి అనేది గుర్తించలేని పరిస్థితి.

ఇలాంటి విషాద సమయంలో ప్రమాద బాధితులకు సాయం అందించేందుకు అందరూ కదలివస్తున్నారు. బాధితుల క్లెయిమ్​ల విషయంలో సడలింపులు ఇస్తామని ఎల్​ఐసీ ప్రకటించింది. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తానని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ హామీ ఇచ్చాడు. ఇప్పుడు మరో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తాను కూడా సాయం అందిస్తానని ముందుకొచ్చాడు. రూ.1 లక్షను విరాళంగా ఇచ్చాడీ లెగ్ స్పిన్నర్. ఒడిశా రైలు బాధితుల కోసం స్కౌట్ అనే గేమింగ్ ఛానల్ నిర్వహిస్తున్న ఛారిటీ వర్క్​కు ఈ డొనేషన్​ను అందించాడు.