ఢిల్లీ వరకు కెసిఆర్ సర్కార్ అవినీతి పాకిందిః ప్రధాని మోడీ

వరంగల్‌: గత 9 ఏళ్లలో తెలంగాణ అభివృద్దికి కేంద్రం శక్తివంచన లేకుండా కృషి చేసిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ ఈరోజు తెలంగాణలో రూ. 6,100 కోట్ల విలువైన అభివృద్ది పనులకు ప్రధాని మోడీ ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం హన్మకొండ‌లో ఏర్పాటు చేసిన బిజెపి బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. తొలుత తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ.. భద్రకాళి అమ్మవారి మహాత్యానికి, సమ్మక్క-సారలమ్మ శౌర్యానికి, రాణి రుద్రమ పరాక్రమానికి నిదర్శనమైన వరంగల్‌కు రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఒక బిజెపి కార్యకర్తగా తాను వరంగల్‌కు వచ్చానని చెప్పారు. జనసంఘ్ కాలం నుంచి ఈ ప్రాంతం తమ భావజాలానికి బలమైన కోటగా ఉందని అన్నారు.

బిజెపి తొలుత సాధించిన రెండు లోక్‌సభ సీట్లలో ఒకటి హన్మకొండ అని అన్నారు. ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని అన్నారు. అందులో తెలంగాణ అతి ముఖ్యమైన భూమిక అని చెప్పారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్‌కు బిజెపి ట్రైలర్ చూపించిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్‌లను అడ్రస్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషించిందని మండిపడ్డారు. తెలంగాణ సర్కార్ అత్యంత అవినీతి ప్రభుత్వం అని విమర్శించారు.

కెసిఆర్ ప్రభుత్వం చేసింది 4 పనులు మాత్రమేనని.. ఉదయం, సాయంత్రం మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని దుర్భాషలాడటం.. ఒక కుటుంబాన్ని అధికార కేంద్రీకృతం చేసి తెలంగాణకు వారే యజమాని అని నిరూపించుకోవడం.. తెలంగాణ ఆర్థికాభివృద్ధిని అడ్డుకోవడం.. తెలంగాణను అవినీతిలో ముంచడం అని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కెసిఆర్ ప్రభుత్వం అంటే అత్యంత అవినీతి ప్రభుత్వం అని.. ఇప్పుడు వారి అవినీతి ఢిల్లీకి కూడా పాకిందని మోదీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే బిఆర్ఎస్ ప్రభుత్వ పని అన్నారు. వారికి పొద్దున లేస్తే అదే పని అని మండిపడ్డారు. కుటుంబాన్ని పెంచిపోషించడమే కెసిఆర్ సర్కార్ పని పని అని విమర్శించారు. కెసిఆర్ కుటుంబం స్కామ్‌ల్లో ఇరుక్కుందని అన్నారు. కుటుంబ పార్టీలన్నింటికీ అవినీతి పునాది ఉందని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు.

గత 9 సంవత్సరాలలో మొత్తం ప్రపంచంలో భారతదేశం గర్వం పెరిగిందని అన్నారు. అందరూ భారతదేశం వైపు చూస్తున్నారని.. దీని వల్ల తెలంగాణ కూడా లాభపడిందని తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని.. తెలంగాణ యువత దీని వల్ల లబ్ది పొందుతున్నారని, వారికి ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పారు.

ఎక్కడైనా అభివృద్ది కోసం రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని.. అవినీతి కోసం ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. ఇందుకోసమేనా తెలంగాణ యువత ఆత్మబలిదానాలు చేసిందని? ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో ఏం చేసిందో చెప్పాలని అన్నారు.

ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని అన్నారు. టీఎస్‌పీఎస్సీ స్కామ్‌తో యువత ఎంతో నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ అయినా, బిఆర్ఎస్ అయినా తెలంగాణ ప్రజలకు రెండూ ప్రాణాంతకమే అని అన్నారు. ఈ రెండింటి నుంచి తెలంగాణ ప్రజలను కాపాడాలని కోరారు. తెలంగాణ వర్సిటీల్లో మూడువేల అధ్యాపక పోస్టులు భర్తీ చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో 15 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.