రాష్ట్ర ప్రభుత్వ పాపాలకు ప్రజలు తిరుగులేని గుణపాఠం చెప్పడం ఖాయం: చంద్రబాబు

పింఛను డబ్బు అడిగిన వితంతువుపై ప్రకాశం జిల్లాలో కేసు పెట్టారని మండిపాటు

chandrababu-naidu-fires-on-ysrcp-government

అమరావతిః ధర్మవరానికి చెందిన వ్యాపారులపై విజయవాడలో అమానుషంగా దాడి చేసిన ఘటనపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రోజుకో ఘోరం జరుగుతోందని, ప్రతి చోటా ప్రభుత్వ టెర్రరిజం కనిపిస్తోందని ఆరోపించారు. ఈ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ పాపాలకు ప్రజలు తిరుగులేని గుణపాఠం చెప్పడం ఖాయమని ట్వీట్ చేశారు.

‘‘బకాయిలు చెల్లించాలని కోరినందుకు ధర్మవరానికి చెందిన చేనేత వస్త్ర వ్యాపారులపై విజయవాడలో వైఎస్‌ఆర్‌సిపి గూండాలు అమానుష దాడికి పాల్పడ్డారు.. బాధితులను నగ్నంగా వీడియోలు తీసి వికృతానందం పొందారు” అని చంద్రబాబు మండిపడ్డారు. రోడ్డు వేయమని ఉప ముఖ్యమంత్రిని అడిగిన పాపానికి చిత్తూరు జిల్లాలో దళిత వర్గానికి చెందిన కానిస్టేబుల్ పై కేసు పెట్టి, సస్పెండ్ చేశారని చెప్పారు. ప్రకాశం జిల్లాలో పింఛను డబ్బు అడిగిన వితంతు మహిళపై కేసు పెట్టారని తెలిపారు.

‘‘రోజుకో ఘోరం.. ప్రతి చోటా ప్రభుత్వ టెర్రరిజం. ఇదీ రాష్ట్రంలో పరిస్థితి. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు శాఖను వైఎస్‌ఆర్‌సిపి అనుబంధ విభాగంగా మార్చిన దుస్థితే ఈ పరిస్థితికి కారణం. ఈ ప్రభుత్వానికి తమ పోకడలపై ప్రజలు ఏమనుకుంటారో అని లేదు.. సమాజం గమనిస్తోందనీ లేదు. ఈ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ పాపాలకు ప్రజలు తిరుగులేని గుణపాఠం చెప్పడం మాత్రం ఖాయం” అని హెచ్చరించారు.