కేసీఆర్ ప్రభుత్వం చేసేది నాలుగే నాలుగు పనులు అంటూ మోడీ సెటైర్లు..

వరంగల్ సభ వేదికగా ప్రధాని మోడీ..కేసీఆర్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు పనులే చేసిందని సెటైర్లు వేశారు. ‘ మొదటిది..ఉదయం లేచింది మొదలు మోడీ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.. మిగతా ఏ పనులు చేయటం లేదు” అన్నారు.

‘‘ఇక రెండోది.. కుటుంబ పార్టీని పోషించడం. కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. అన్ని పదవులు కేసీఆర్ కుటుంబానికే ఉన్నాయి. మూడోది.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. మిగులు నిధులతో ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణ చేశారు” అని , ‘‘ఇక నాలుగోది.. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ప్రతి పనిలోనూ అవినీతి జరుగుతోంది. అవినీతి ఆరోపణలు లేని ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదు” అని తీవ్ర విమర్శలు చేశారు. తన 9 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసింది ఈ నాలుగు పనులే అని ఆరోపించారు.

దేశంలో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతిని జనం చూశారు. వారి విషయంలో జాగ్రత్త పడకపోతే తెలంగాణ నష్టపోతుంది. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చేది బీజేపీ మాత్రమే. బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది అని ప్రధాని మోడీ అన్నారు. కేసీఆర్ పాలన అవినీతిమయం అయిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నో పోరాటల తర్వాత సాధించిన తెలంగాణ అభివృద్ధిని నాశనం చేశారు. కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు పాకింది. అభివృద్ధికోసం కొన్ని రాష్ట్రాలు కలిసి పనిచేస్తుంటాయి. తొలిసారిగా రెండు రాష్ట్రాలు (ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలు) అవినీతి కోసం కలిసి పనిచేయడం దౌర్భాగ్యం. కేసీఆర్ కుటుంబం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాయని మోడీ అన్నారు.