పాకిస్థాన్ నూతన ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌..ప్రధాని మోడీ శుభాకాంక్షలు

ప్రజాసంక్షేమం కోసం పనిచేద్దామన్న మోడీ
కశ్మీర్ అంశం తేలాకే మరేదైనా అంటూ షెహబాజ్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ఇమ్రాన్ స్థానంలో పీఎంఎల్-ఎన్ చీఫ్ షెహబాజ్‌ షరీఫ్‌ పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా షెహబాజ్‌ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగ్రవాదానికి తావులేని రీతిలో భారత్ శాంతి, సుస్థిరతలనే కోరుకుంటుందని స్పష్టం చేశారు. “అందుకే మనం అభివృద్ధి సవాళ్లపైనే దృష్టి నిలిపి, మన ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం పాటుపడదాం” అని పిలుపునిచ్చారు.

కాగా, షెహబాజ్‌ షరీఫ్‌ పాక్ ప్రధాని పీఠం ఎక్కారో, లేదో, కశ్మీర్ అంశంలో తమ నైజం బయటపెట్టుకున్నారు. భారత్ తో తాము సఖ్యతగా ఉండాలనే కోరుకుంటున్నామని, కానీ కశ్మీర్ అంశం తేలనిదే అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. అంతేకాదు, ఆర్టికల్ 370 రద్దు, అనేక చర్యల ఫలితంగా కశ్మీర్ లో ప్రజలు నెత్తురోడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశం తేలాకే ఇతర అంశాలపై దృష్టి పెడదామని భారత్ అధినాయకత్వానికి సూచించారు. కశ్మీరీలకు పాకిస్థాన్ ప్రభుత్వం నైతికపరమైన, దౌత్యపరమైన మద్దతు ఇస్తుందని షెహబాజ్‌ పేర్కొన్నారు. పొరుగుదేశాలను ఎవరూ ఎంచుకోలేరని, పక్కన ఏ దేశం ఉంటే దానితో కలిసి వుండాల్సిందేనని వ్యాఖ్యానించారు. అయితే, దేశ విభజన సమయం నుంచి భారత్ తో పాకిస్థాన్ కు మంచి సంబంధాలే లేవని, ఇది దురదృష్టకరమని వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/