మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్

నంద్యాల టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మంగళవారం రాత్రి ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడి కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు భార్గవ్‌ రామ్‌, పీఏ మోహన్‌కు కూడా అదుపులోకి తీసుకొని , వారిని నంద్యాల పీఎస్‌కు తరలించారు.

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాలలో కొనసాగుతుంది. ఈ యాత్రలో టీడీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఆయన వర్గీయులు పాల్గొన్నారు. ఈ సమయంలో భూమా అఖిలప్రియ వర్గానికి చెందిన కొందరు.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఆయనకు గాయాలు అయ్యాయి. లోకేష్ ముందే ఈ దాడి జరుగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తనపై దాడి చేయడంపై ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దమ్ముంటే డైరెక్ట్‌గా కక్ష తీర్చుకోవాలంటూ సవాల్ విసిరారు. ఈ సమయంలో రెండు వర్గాల వారు పరుష పదజాలం వాడుతూ నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు.

భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఎప్పటి నుంచో ఈ వార్ నడుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో కూడా ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. మూడేళ్ల క్రితం ఏకంగా హత్యకు కుట్ర జరిగింది.. కానీ పోలీసులు కుట్రను భగ్నం చేశారు. ఈ కేసులో నిందితుల్ని అరెస్ట్ చేయగా.. మాజీ మంత్రి అకిలప్రియ సుఫారీ ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. కొంతకాలంగా రెండు వర్గాలు ఎవరి పని వారు చేసుకుంటున్నారు.. ఇప్పుడు యువగళం పాదయాత్రలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.

అఖిల ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని ప్రచారం జరుగుతుంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏవీ సుబ్బారెడ్డి, ఆయన వర్గం.. అఖిల ప్రియతో పాటు మరికొందరిపై హత్యయత్నం కేసులు పెట్టారు. దీనిపై స్పందించిన పోలీసులు అసలేం జరిగిందని ఆరాతీసి ఇవాళ ఉదయమే అఖిలను అరెస్ట్ చేశారు. మరోవైపు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా ఏవీ సుబ్బారెడ్డి, అఖిల ప్రియ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.