నేటి నుండి కౌలురైతుల భరోసా యాత్ర

అనంతపురం జిల్లాలో ప్రారంభం

Pawan Kalyan

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు నుండి అనంతపురం జిల్లాలో కౌలురైతుల భరోసా యాత్ర చేపట్టనున్నారు. కొత్త చెరువు నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయం అందించనున్నారు. ఏయే జిల్లాల్లో ఎంత మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే వివరాలను జనసేన యంత్రాంగం ప్రభుత్వం నుంచి సమాచార హక్కు చట్టం కింద సేకరించింది. ఆ సమాచారం ప్రకారమే ఆయా జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్‌ కలుసుకోనున్నారు.

కొత్త చెరువు నుంచి ఉదయం 10.30గంటలకు బయలుదేరి ధర్మవరానికి చేరుకొని మరో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందించనున్నారు. 11.20 గంటలకు ధర్మవరం నుంచి గొట్లూరుకి చేరుకొని.. మరో రైతు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామానికి 12.10 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్యకు పాల్పడిన యువ రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేయనున్నారు. జిల్లాలోని పర్యటనలో చివరిగా అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ గ్రామంలో ఇద్దరు కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందజేసి.. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు.