మచిలీపట్నంలో పవన్ మౌనదీక్ష ..జగన్ పై వ్యక్తిగత ద్వేషం లేదన్న జనసేనాని

అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపించాలనే ఆలోచనలు సరికాదని వ్యాఖ్య

pawan-kalyan-mouna-deeksha

మచిలీపట్నం : ఏపీలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మౌనదీక్షకు దిగారు. మచిలీపట్నంలోని సువర్ణ కల్యాణ మంటపం వద్ద గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పవన్ నివాళి అర్పించారు. అనంతరం రెండు గంటల పాటు ఆయన దీక్షను చేపట్టారు. ఆయనకు సంఘీభావంగా నాదెండ్ల మనోహర్, ఇతర జనసేన నేతలు కూడా దీక్షలో కూర్చున్నారు.

మౌన దీక్ష అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… మచిలీపట్నం వంటి గొప్ప నేలపై గాంధీ జయంతిని చేసుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. మచిలీపట్నం గొప్పతనం ఏమిటంటే… జనసేన ఆవర్భావ సభలో జాతీయగీతం రాగానే 10 లక్షల మంది లేచి నిలబడ్డారని తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత టిడిపి తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గాంధీ జయంతి వేడుకలను మచిలీపట్నంలోనే జరుపుతామన్నారు.

సత్యం, అహింస అనే ఆయుధాలతో యుద్ధం ఎలా చేయాలో ప్రపంచానికి చూపిన మహాత్ముడి బాటలో నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ తదితరులు నడిచారని పవన్ చెప్పారు. అహింసాయుత ప్రజా పోరుతో పరాయి పాలన నుంచి భారత్ కు విముక్తిని కల్పించారని తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో బ్రిటీషర్ల లక్షణాలను పుణికిపుచ్చుకున్న పాలకులు ఉన్నారని మండిపడ్డారు. ప్రజలను ముక్కలుగా విడదీస్తూ విభజించు పాలించు అనే ధోరణితో ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. గాంధీజీ సత్యాగ్రహం, ఓటు అనే ఆయుధాలను ఉపయోగించి ఈ పాలకులను రాష్ట్రం నుంచి తరిమేయాలని పిలుపునిచ్చారు.

సీఎం జగన్ పై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని… వైస్సార్సీపీ అనుసరిస్తున్న విధానాలపై మాత్రమే విభేదాలు ఉన్నాయని పవన్ చెప్పారు. అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపించాలనే ఆలోచనలు సరైనవి కాదని అన్నారు.