బీహార్‌లో కులాల సర్వే నివేదిక విడుదల

Bihar caste census results out, OBCs form 63% of population, General 16%

పాట్నా: బీహార్‌లో నిర్వహించిన కులాల సర్వే నివేదికను సోమవారం విడుదల చేశారు. ఈ రిపోర్ట్‌ ప్రకారం ఆ రాష్ట్ర జనాభాలో 63 శాతం మంది ఇతర వెనుకబడిన వర్గాల ( ఓబీసీ)లకు చెందిన వారు. 16 శాతం మంది జనరల్‌ కేటగిరీకి చెందిన వారు. బీహర్‌ రాష్ట్ర జనాభా 13.1 కోట్లకుపైగా ఉంది. ఇందులో 36 శాతం అత్యంత వెనుకబడిన తరగతులు కాగా, 27.1 శాతం వెనుకబడిన తరగతులకు చెందిన వారు. 19.7 శాతం షెడ్యూల్డ్ కులాలు ( ఎస్సీ), 1.7 శాతం షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) వారు ఉన్నారు. మిగిలిన సాధారణ జనాభా 15.5 శాతం.

కాగా, బీహార్‌లో నిర్వహించిన కుల ఆధారిత సర్వే ప్రకారం ఆ రాష్ట్ర జనాభాలో దాదాపు మూడింట రెండొంతుల మంది అంటే సుమారు 63.1 శాతం ఓబీసీలు ఉన్నారు. అలాగే ఓబీసీ వర్గాల్లో అత్యధికంగా 14.27 శాతం యాదవ వర్గం వారు ఉన్నారు. మొత్తంగా బీహార్‌ జనాభాలో ఎక్కువ శాతం ఓబీసీలు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 27 శాతానికి పరిమితమైన ఓబీసీ కోటాను జనాభాకు అనుగుణంగా పెంచాలన్న డిమాండ్‌ కూడా వినిపిస్తున్నది.

మరోవైపు గాంధీ జయంతి రోజున కుల సర్వే నివేదిక విడుదల పట్ల బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి కుల సర్వే ఫలితాలను వివరిస్తామని తెలిపారు.