అమెరికా బాటలోనే ఆస్ట్రేలియా

ఒలింపిక్స్‌ను బాయ్‌కాట్‌ చేసిన ఆస్ట్రేలియా

కాన్‌బెర్రా : చైనాకు మరో షాక్‌ తగిలింది. వచ్చే ఏడాది చైనాలో జరిగే వింటర్‌ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా బాయ్‌కాట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా సైతం అమెరికాతో కలిసి వెళ్లనున్నట్లు ప్రకటించింది. దౌత్యపరంగా ఒలింపిక్స్‌ గేమ్స్‌ను నిషేధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ బుధవారం తెలిపారు. ఇటీవలి చైనాతో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత గేమ్స్‌ను బహిష్కరించడంలో ఆశ్చర్యం లేదని, నిర్ణయం సరైందేనన్నారు.

దౌత్యపరంగా గేమ్స్‌ను బాయ్‌కాట్‌ చేసినా.. అథ్లెట్లు పోటీల్లో పాల్గొంటారన్నారు. చైనాలో మానవహక్కుల ఉల్లంఘనలను ఉటంకిస్తూ.. ‘ముఖ్యంగా ఇటీవల అణుశక్తితో నడిచే జలాంతర్గాములను కొనుగోలు చేయాలనే మా నిర్ణయానికి సంబంధించింది. ఈ ప్రాంతంలో బలమైన రక్షణ దళాన్ని కలిగి ఉండేందుకు ఆస్ట్రేలియా చేస్తున్న ప్రయత్నాలను చైనా విమర్శించింది’ అన్నారు. తమతో ఉన్న విభేదాలపై చైనాతో చర్చించేందుకు సిద్ధమని, ఇందుకు డ్రాగన్‌ దేశం అంగీకరించడం లేదన్నారు.

కాగా, ఇప్పటికే అమెరికా తీసుకున్న నిర్ణయంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. దౌత్యపరంగా క్రీడలను బహిష్కరించడాన్ని ఖండించిన డ్రాగన్‌ దేశం.. పగ తీర్చుకుంటామని హెచ్చరించింది. అయితే, ఫిబ్రవరిలో జరిగే వింటర్‌ క్రీడలకు 40 నుంచి అంతకంటే ఎక్కువ మందిని అథ్లెట్లను గేమ్స్‌కు పంపాలని భావిస్తుండగా.. మోరిసన్‌ ప్రకటన దీనిపై ప్రభావం చూపబోదని ఆస్ట్రేలియన్‌ ఒలిపింక్‌ కమిటీ పేర్కొంది. అథ్లెట్లను సురక్షితంగా బీజింగ్‌కు చేర్చడం, మళ్లీ ఇంటికి తీసుకురావడం అతిపెద్ద సవాల్‌గా మారిందని కమిటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మాట్‌ కారోల్‌ పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/