రాష్ట్ర మంత్రివర్గంలోకి నారా లోకేష్

Lokesh family special poojas
Lokesh family special poojas

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయ డంఖా మోగించిన సంగతి తెలిసిందే. 164 అసెంబ్లీ , 21 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నెల 12 న చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదే తరుణంలో పలువురికి మంత్రివర్గంలో స్థానం కల్పించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఆయనకు ప్రాధాన్యమున్న మంత్రిత్వ శాఖల బాధ్యతలు అప్పగించే అవకాశముంది.

ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల కథనం. సుదీర్ఘంగా యువగళం పాదయాత్ర చేసి ఎన్డీయే విజయంలో కీలక భూమిక పోషించిన నారా లోకేశ్‌ ఒక సందర్భంలో ఎన్నికల్లో గెలిచాక మంత్రి వర్గంలో చేరడం కన్నా పార్టీ పరంగా బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే కేంద్ర క్యాబినెట్‌లో 2 మంత్రి పదవులు, మరో రెండు సహాయ మంత్రి పదవులు లభించే వీలుందని టిడిపి పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

టిడిపి నుంచి లోక్‌సభకు గెలుపొందినవారిలో బలహీనవర్గాలకు చెందినవారు అత్యధికంగా ఆరుగురున్నారు. వీరిలో వరుసగా మూడోసారి గెలుపొందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడి పేరు మంత్రి పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తండ్రి దివంగత నేత ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా పని చేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయన మరణం తర్వాత రామ్మోహన్‌నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన బాబాయి అచ్చెన్నాయుడు, మామ బండారు సత్యనారాయణమూర్తి, బావ ఆదిరెడ్డి వాసు తాజా ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. హిందూపురం నుంచి రెండోసారి గెలిచిన పార్థసారధి సీనియర్‌ అయినప్పటికీ రామ్మోహన్‌నాయుడి వైపు మొగ్గు కనిపిస్తోంది.