”దిశ” యాప్‌ పై ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు..

దిశ యాప్ ఫై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసారు. సోమవారం తాడిపల్లి గూడెం లో ‘దిశ’ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల నిరోధం–తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాల నిరోధం… తదితర అంశాలపై సీఎం జగన్‌ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భాంగా జగన్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి మ‌హిళ సెల్‌ఫోన్‌లో దిశ యాప్ ఉండాలని, అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు దిశ‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని, వ‌లంటీర్లు, మ‌హిళా పోలీసుల స‌హాయంతో విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. ‘దిశ’ చాలా సమర్థవంతంగా అమలు చేయాలని, ‘దిశ’యాప్‌ డౌన్లోడ్, వినియోగించే విధానంపై ప్రచారం నిర్వహించాలని సూచించారు.

అమ్మాయిల పై అఘాయిత్యాలను నివారించడమే కాదు, దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. శరవేగంగా బాధితులను ఆదుకోవాలని వెల్లడించారు సీఎం జగన్. వారికి ఇవ్వాల్సిన పరిహారాన్ని సత్వరమే అందించేలా చూడాలని.. ఘటన జరిగిన నెల రోజుల్లోపు బాధిత కుటుంబాలకు అందజేయాలని పేర్కొన్నారు. ఎక్కడైనా అలసత్వం జరిగితే వెంటనే తన కార్యాలయానికి సమాచారం ఇవ్వాలనిసూచించారు.

ఇప్పటి వరకు 74,13,562 ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్స్‌ చేశారని, దిశ యాప్ ద్వారా 5238 మందికి సహాయం అందించామ‌ని పోలీస్ ఉన్న‌తాధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. దిశయాప్‌ ద్వారా 2021లో 684 ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేశామ‌న్నారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్‌ చేశామని తెలిపారు. అందిన ఫిర్యాదులపై పరిష్కారం ఎంతవరకూ వచ్చిందన్న దానిపై నిరంతరం మెసేజ్‌లు పంపిస్తున్నామని చెప్పారు. దిశ పోలీస్‌స్టేషన్లు అన్నింటికీ కూడా ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు. మహిళలపై నేరాలకు సంబంధించి 2017లో ఇన్వెస్టిగేషన్‌కు 189 రోజులు పడితే 2021లో కేవలం 42 రోజుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్నామన్నారు.