వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం బీఆర్ఎస్ పోరు ప్రారంభం

మొదటి నుండి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తు వస్తున్న కేసీఆర్..ఇప్పుడు విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఫ్యాక్టరీ నిర్వహణకు కావాల్సిన నిధులు ఇచ్చి ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనిపై విశాఖకు వెళ్లి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం పట్ల ఏపీ ప్రజల తో పాటు పలు పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే క్రమంలో ఏపీ బీఆర్ఎస్ ఛీఫ్ తోట చంద్రశేఖర్ ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులతో భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారో వారికి వివరించారు. త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు చేసి సమరశంఖారావం పూరిస్తారన్నారు. ఎంతో చరిత్ర కలిగిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఓ క్రూరమైన చర్యగా అయన అభివర్ణించారు. రాజకీయ కుట్రలను అడ్డుకుని తీరుతామని, విశాఖ వాసులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. విశాఖలో చదువుకున్నానని, అప్పుట్లో స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమాలను కళ్లారా చూశానంటూ గుర్తు చేసుకున్నారు.

కార్మికుల కష్టాన్ని కబ్జా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అదానీకి కట్టబెట్టేందుకు బీజేపీ సర్కారు పావులు కదుపుతోందని, ప్రజల ఆస్తులను ప్రైవేట్‌ శక్తులకు అప్పగించాలని మోడీ చూస్తున్నారని విమర్శించారు. ఇదేనా బీజేపీ సిద్ధాంతమంటూ ప్రశ్నించారు.

అదానీ బొగ్గు దిగుమతులకు స్టీల్‌ ప్లాంట్‌ భూములు కావాలని, గంగవరం పోర్టుని అదానీ దిగుమతుల కోసం ఉపయోగిస్తున్నారని, ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్‌పైనా అదే కుతంత్రాన్ని ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.5 వేలకోట్లు ఇవ్వలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదా? అంటూ నిలదీశారు. కేంద్ర బడ్జెట్‌ రూ.45లక్షల కోట్లని, అందులో రూ.5వేల కోట్ల సాయం విశాఖకు కేంద్రం చేయలేదా? అని నిలదీశారు.