కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన..17 మంది మృతి

శిథిలాల కింద చిక్కుకుని కార్మికులు దుర్మరణం

Mizoram: 17 Labourers Dead After Under-Construction Railway Bridge Collapses

మిజోరం : ఈశాన్య రాష్ట్రం మిజోరంలో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే వంతెన కుప్పకూలింది. దీంతో 17 మంది కార్మీకులు అక్కడికక్కడే చనిపోయారు. కూలిన శిథిలాల కింద చిక్కుకుని మరికొంతమంది చనిపోయే అవకాశం ఉందని, దీంతో మృతుల సంఖ్య పెరగనుందని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐజ్వాల్ కు సుమారు 21 కిలోమీటర్ల దూరంలోని సాయిరంగ్ గ్రామం సమీపంలో రైల్వే వంతెన నిర్మాణంలో ఉంది. బుధవారం ఎప్పట్లాగే నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఉదయం పది గంటల ప్రాంతంలో బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది.
ఆ సమయంలో సుమారు 35 నుంచి 40 మంది కార్మికులు పని చేస్తున్నారని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన 17 మంది కార్మికుల మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. బ్రిడ్జి శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు. కాగా, ఈ ప్రమాదంపై మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. వంతెన కూలిన విషయం తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయినట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారని ముఖ్యమంత్రి జోరంతంగా వివరించారు.