యాంటిల్లా బాంబు బెదిరింపు కేసు..పోలీసు ఆఫీస‌ర్‌కు సుప్రీం బెయిల్‌

Antilia bomb scare case: Supreme Court grants bail to ex-cop Pradeep Sharma

న్యూఢిల్లీ: ముంబయి మాజీ పోలీసు ఆఫీస‌ర్ ప్ర‌దీప్ శ‌ర్మకు.. సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ మంజూరీ చేసింది. యాంటిల్లా బాంబు బెదిరింపు కేసుతో పాటు వ్యాపార‌వేత్త మ‌న్సూక్ హిర‌న్ హ‌త్య కేసులో ప్ర‌దీప్ నిందితుడిగా ఉన్నాడు. 2021, ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన ద‌క్షిణ ముంబయిలోని యాంటిల్లాలో ఉన్న‌ రిల‌య‌న్స్ వ్యాపార దిగ్గ‌జం ముఖేశ్ అంబానీ ఇంటి వ‌ద్ద ఆగి ఉన్న ఎస్‌యూవీలో పేలుడు ప‌దార్ధాల‌ను స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. జ‌స్టిస్ ఏఎస్ బొప్ప‌న్న నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ తీర్పును వెలువ‌రించింది. పోలీసు ఆఫీస‌ర్ ప్ర‌దీప్ శ‌ర్మ‌కు జూన్‌లో సుప్రీంకోర్టు మూడువారాల తాత్కాలిక బెయిల్‌ను ఇచ్చింది.

ప్ర‌దీప్ శ‌ర్మ‌తో పాటు ద‌యా నాయ‌క్‌, విజ‌య్ స‌ల్సాక‌ర్‌, ర‌వీంద్ర‌నాథ్ ఆంగ్రేలపై ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ఆఫీస‌ర్లు ముంబయిలో చాలా వ‌ర‌కు ఎన్‌కౌంట‌ర్లు చేసిన‌ట్లు కేసులు ఉన్నాయి. ఈ బృందం దాదాపు 300 మంది నేర‌స్థుల్ని ఎన్‌కౌంట‌ర్ చేశారు. అయితే యాంటిల్లా కేసుతో లింకు ఉన్న పోలీసు ఆఫీస‌ర్ స‌చిన్ వాజేను డిస్మిస్ చేసిన విష‌యం తెలిసిందే. హిర‌న్‌ను హ‌త్య చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న్ను ఉద్యోగం నుంచి తొల‌గించారు. ఈ కేసుతో లింకు ఉన్న ప్ర‌దీప్ శ‌ర్మ‌ను 2021 జూన్‌లోనే అరెస్టు చేశారు.