ఈరోజు మురళీకృష్ణుడు అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ లక్ష్మినరసింహ స్వామి

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 21 నుండి అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్య లో భక్తులు హాజరవుతూ వస్తున్నారు. ఇక రోజుకో రూపంలో లక్ష్మినరసింహ స్వామి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. నేడు ఐదో రోజైన నేడు శ్రీ లక్ష్మినరసింహ స్వామి శ్రీకృష్ణుడి (మురళీకృష్ణుడు) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ఆలయ తిరుమాఢవీధుల్లో ఊరేగించారు. అనంతరం వేంచేపు మండపంపై ఆస్థానం చేసి వేదమంత్రాలు పఠించారు. సాయంత్రం పొన్న వాహన సేవ నిర్వహించనున్నారు.

రేపు ఆదివారం ఉయదం జగన్మోహుడి అలంకారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఇక రాత్రికి అశ్వవాహనంపై ఎదుర్కోలు, 28న తిరుల్యాణ మహోత్సవం, మార్చి 1న దివ్య విమాన రథోత్సవం, శ్రీమహావిష్ణువు అవతారంలో గరుడవాహన సేవ, రాత్రికి ప్రధానాలయం తిరువీధుల్లో రథోత్సవం, 2న ఉదయం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, రాత్రికి శ్రీపుష్పయాగం, దోపోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల చివరి రోజు 3న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రికి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.

ఇక నిన్న శుక్రవారం గవర్నర్ తమిళసై మాడవీధుల్లో ఊరేగిన శ్రీస్వామి వారి సేవోత్సవంలో పాల్గొన్నారు. ఉదయం యాదగిరి గుట్టకు చేరిన గవర్నర్.. మొదటగా స్వయంభూ నరసింహుడి దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామివారి వటపత్రశాయి అలంకార సేవలో పాల్గొన్నారు.అంతకుముందు ఆలయానికి చేరుకున్న గవర్నర్‌ తమిళిసైకి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈవో గీత, ఆలయ అధికారులు పాల్గొన్నారు.