భవిష్యత్తులో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయిః సిఎం జగన్

అమరావతిః నేడు సిఎం జగన్ గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థకు చెందిన సోలార్ పవర్ ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..అవుకు సోలార్ పవర్ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి రైతులకు లబ్ధి చేకూరుతుందని జగన్ వివరించారు. 8 ఎకరాలలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుందని దీని కోసం లీజుకు భూమి ఇచ్చిన రైతులకు ప్రతి ఏడాది ఎకరాకు 30 వేల రూపాయలు ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకూ మంచి జరుగుతుందని దశాబ్దాలుగా నీళ్లకు కటకటలాడే ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుల కారణంగా రైతులకు మంచి జరుగుతుందని వెల్లడించారు. పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తు తరాలకు గ్రీన్ ఎనర్జీ అందుతుందని.. కాలుష్య కారక విద్యుత్‌పై ఆధారపడే పరిస్థితి క్రమేణా తగ్గుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని.. వీటికి అనుబంధంగా సోలార్, విండ్ ప్రాజెక్టులు అనుసంధానం అవుతున్న తీరు గ్రీన్ ఎనర్జీలో విప్లవానికి దారి తీస్తాయన్నారు. దేవుడు గొప్పవాడు, అందుకే మానవాళికి ఇంత చక్కటి వనరులు ఇచ్చాడని సీఎం జగన్ వెల్లడించారు.