కేంద్ర ప్ర‌భుత్వానికి వ్యతిరేకంగా పాట పాడిన మమతా బెనర్జీ

కోల్ కతాలో 30 గంటల నిరసన దీక్ష

mamata-banerjee-sings-bengali-songs-amid-30-hour-sitting-against-centre

కోల్‌కతాః తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా బిజెపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా తమ రాష్ట్రానికి నిధులను విడుదల చేయడం లేదంటూ కోల్ కతాలో బుధవారం నుంచి 30 గంటల నిరసన దీక్ష చేపట్టారు. రెండో రోజు, గురువారం మమత బెనర్జీ తన నిరసనను ఓ పాట రూపంలో వ్యక్తం చేశారు. బెంగాలీలో రాసిన ఈ పాటను టీఎంసీ నేతలతో కలిసి ఆమె పాడారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, గ్రామీణ ఉపాధి హామీ పథకం సహా అనేక పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులను విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ, వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రఖ్యాత బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మమత నిరసన చేపట్టారు. బిజెపిని గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడాలన్నారు. బిజెపి హింసించని పార్టీ ఏదీ లేదని, అందుకే అన్ని ప్రతిపక్ష పార్టీలను తాను కోరుతున్నానని మమత చెప్పారు. ఈ నిరసన దీక్ష ఈ రోజు రాత్రి 7 గంటలకు ముగియనుంది.