‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రారభించబోతున్న మోడీ

అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ట అనంతరం ప్రధాని మోడీ దేశ ప్రజలకు తీపి కబురు తెలిపారు. దేశవ్యాప్తంగా సౌరశక్తి నుంచి విద్యుత్‌ ఉత్పత్తి పెంచేందుకు గాను ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రారంభించనున్నామని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అనంతరం తన నివాసానికి వెళ్తున్న సమయంలో పీఎం మోదీ ఈ పథకంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘ప్రపంచంలోని భక్తులందరూ సూర్యవంశీ శ్రీరాముడి కాంతితో ఎల్లప్పుడూ శక్తిని పొందుతారు. అయోధ్యలో రాల్‌ లల్లా పవిత్ర ఉత్సవం తర్వాత దేశ ప్రజలంతా.. తమ ఇళ్లపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ వ్యవస్థను కలిగి ఉండాలి. దాని కోసం ఈ పథకాన్ని ప్రారంభించనున్నాం’ అని నరేంద్ర మోదీ తన ‘ఎక్స్’ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

దేశంలో సుమారు కోటి ఇళ్లలో ఈ పథకం ద్వారా సోలార్‌ రూఫ్‌ టాప్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ పథకం పేద, మధ్యతరగతి చెందినవారికి కరెంట్‌ బిల్లు తగ్గించడమే కాకుండా విద్యుత్‌ రంగంలో భారత దేశ స్వావలంబనను పెంచుతుందని పేర్కొన్నారు.