రామనవమి వేడుకల్లో విషాదం..ఆలయంలో మెట్లబావిలో పడిన భక్తులు

ఇండోర్‌ః మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలి.. అందులో భక్తులు పడిపోయారు. పటేల్ నగర్ ప్రాంతంలోని శ్రీ బాలేశ్వర మహదేవ్ జులేలాల్ ఆలయంలో గురువారం రామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉండటంతో స్థలం లేక కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి పై కూర్చున్నారు.
ఆ బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాదాపు 25 మంది భక్తులు అందులో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. నిచ్చెన సహాయంతో బావిలో పడిపోయినవారిని బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు.