ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు రద్దు

Lakshadweep MP Mohammed Faizal’s Lok Sabha membership restored ahead of SC hearing

న్యూఢిల్లీ: ఎన్సీపీ నేత మహమ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటును లోక్‌సభ రద్దు చేసింది. ఈమేరకు ఫైజల్‌కు లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హత్య కేసులో ఫైజల్‌ను దోషిగా నిర్ధరించి కవరత్తీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ జనవరి 13న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తీర్పుపై కేరళ హైకోర్టు స్టే విధించింది. అయినా అనర్హతను లోక్‌సభ సెక్రటేరియట్‌ ఎత్తేయలేదని సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన పిటిషన్‌ను విచారించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సమ్మతించిన నేపథ్యంలో అనర్హత వేటును లోక్‌సభ సెక్రటేరియట్‌ రద్దుచేయడం గమనార్హం.

కాగా, ఓ హత్యాయత్నం కేసులో ఈ ఏడాది జనవరి 11న కవరట్టి సెషన్స్‌ కోర్టు మహమ్మద్‌ ఫైజల్‌కు పదేండ్ల జైలు శిక్ష విధించింది. దీంతో అదే నెల 13న లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆయనపై అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్‌ జారీచేసింది. అనంతరం ఆయన తన జైలు శిక్షను సవాల్‌ చేస్తూ కేరళ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిని విచారించిన కోర్టు ఆయనకు విధించిన శిక్షపై స్టే విధించింది. అయినప్పటికీ ఆయనపై అనర్హతను లోక్‌సభ సెక్రటేరియట్‌ ఎత్తివేయలేదు. తాను పార్లమెంటుకు వచ్చినప్పటికీ.. భద్రతా సిబ్బంది సభలోపలికి అనుమతించడం లేదంటూ ఇటీవల ఆయన సుప్రీకోర్టును ఆశ్రయించారు.