నేడు నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో కేటీఆర్‌ పర్యటన

లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో బిఆర్ఎస్ పార్టీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన కేసీఆర్..ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో నేడు నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌ పర్యటించబోతున్నారు. అక్కడ నిర్వహించే కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని.. పదేళ్ల తమ పాలనలో తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లేలా ప్రచార కార్యక్రమాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఇక ఇప్పటికే ప్రచారంలో జోరు మీదున్న బీఆర్ఎస్ ఉగాది పండుగ తర్వాత మరింత ఉద్ధృతం చేసేందుకు సిద్ధమవుతోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 13వ తేదీన చేవెళ్ల వేదికగా జరగనున్న బహిరంగసభలో కేసీఆర్ పాల్గొంటారు. 15వ తేదీన మెదక్ లోనూ కేసీఆర్ సభ జరగనుంది. మరోపక్క వరుసగా బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరడం ఫై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను తమ పార్టీలో చేర్చుకోవడంలో కాంగ్రెస్‌, బీజేపీ దొందూదొందేనని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్నదానికి, ఆచరిస్తున్నదానికి పొంతన లేదని ఎక్స్‌ వేదికగా దుమ్మెత్తిపోశారు.

ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు పడేలా చట్ట సవరణ చేస్తామని కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్నదని కానీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు ఏకంగా ఎంపీ టికెట్‌ కేటాయించి తన ద్వంద్వనీతిని బయటపెట్టుకున్నదని మండిపడ్డారు. మరో ఎమ్మెల్యేకు కాంగ్రెస్‌ కండు వా కప్పి పార్టీలో చేర్చుకున్నదని విమర్శించారు. గెలిచేంత వరకు ఒకమాట, గెలిచాక ఇంకోమాట.. ఇదే కాంగ్రెస్‌ రీతి, నీతి అని ఆగ్రహం వ్యక్తంచేశారు.