బిజెపి ఫై మంత్రి కేటీఆర్ ఫైర్..నీతి లేని పాల‌న‌కు ప‌ర్యాయ‌ప‌దం

బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్..మరోసారి బిజెపి తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. గురువారం తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘డబుల్‌ ఇంజిన్‌ సర్కార్ అంటే ఒక ఇంజిన్‌ మోదీ.. మరో ఇంజిన్‌ అదానీ. అదానీకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పాలసీ చేసింది.. స్కామ్‌ అంటే అదీ. అదానీ పోర్ట్‌లో డ్రగ్స్‌ దొరికితే స్కామ్‌ కాదా? ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ను విచారణకు పిలిస్తే దాక్కున్నారు. కర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని పత్రికలు చెబుతున్నాయి. బీజేపీలో ఉన్నవాళ్లంతా హరిశ్చంద్రుడి సోదర సోదరీమణులా?అదానీపై శ్రీలంక చేసిన ఆరోపణల్లో నిజం లేదని ప్రజల ముందుకొచ్చి చెప్పగలరా?’’ అని కేటీఆర్‌ నిలదీశారు.

ఎమ్మెల్సీ క‌విత‌కు ఇచ్చింది ఈడీ స‌మ‌న్లు కాదు.. క‌చ్చితంగా మోడీ స‌మ‌న్లు అని కేటీఆర్ అన్నారు. ఒక ప‌రంప‌ర‌లో భాగంగా దేశంలో గ‌త 8 ఏళ్లుగా జ‌రుగుతున్న ప్ర‌హ‌స‌నంలో భాగంగా ఈరోజు అయితే జుమ్లా లేక‌పోత ఆమ్లా అనే విధానంలో మోడీ ప్ర‌భుత్వం నడుస్తుందన్నారు. మా నాయకులపై వరుసపెట్టి సిబిఐ , ఈడీ దాడులు చేయించింది బిజెపి సర్కార్. కేసీఆర్ నాయ‌క‌త్వంలో దేశంలో బీఆర్ఎస్ పురోగ‌మిస్తున్న విధానం, తెలంగాణ‌లో ఒక అజేయ‌మైన శ‌క్తిగా ఎదిగిన విధానాన్ని గ‌మ‌నించిన త‌ర్వాత‌ ఎమ్మెల్సీ క‌వితకు కూడా ఈడీ స‌మ‌న్లు పంపింది. ఇవి ఈడీ స‌మ‌న్లు కాదు.. క‌చ్చితంగా మోడీ స‌మ‌న్లు. ఇది రాజ‌కీయంగా చేసే చిల్ల‌ర ప్ర‌య‌త్నం. సీబీఐ, ఈడీ, ఐటీ కేంద్రం చేతుల్లో కీలుబొమ్మ‌లాగా మారాయాని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరగానే కేసులు ఏమైపోతున్నాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సుజనా చౌదరిపై రూ.6వేల కోట్ల కేసు ఏమైందని అడిగారు. అదానీపై కేసులు ఏమయ్యాయని.. ఆయనపై శ్రీలంక చేసిన ఆరోపణలుకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. సీబీఐ, ఈడీ కేసులు కేవలం ప్రతిపక్షాలపైనే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. బీజేపీలో ఉన్న వాళ్లంతా సత్యహరిశ్చంద్రుని సోదరసోదరీమణులా అని కేటీఆర్ అన్నారు.