ఇది రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్యేః మంత్రి కెటిఆర్

భార‌త చ‌ట్టాల‌ను గౌర‌వించే పౌరులుగా విచార‌ణ‌కు హాజ‌రవుతాం..

KTR responds to ED notices to Kavitha, says they will face investigation

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీ చేయడంపై మంత్రి కెటిఆర్ మెదటిసారి స్పందించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మోడీ స‌మ‌న్ల‌కు భ‌య‌ప‌డేవారు తెలంగాణ లోఎవ‌రూ లేరు.. త‌ప్ప‌కుండా విచార‌ణ‌ను ఎదుర్కొంటాం స్ప‌ష్టం చేశారు.లిక్క‌ర్ స్కాంలో మా ఎమ్మెల్సీ క‌వితకు నోటీసులు ఇచ్చారు. మీ మాదిరిగా కాకుండా త‌ప్ప‌కుండా విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తారు. ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్ సంతోష్ విచార‌ణ‌కు రాకుండా దాక్కున్నాడు. భార‌త చ‌ట్టాల‌ను గౌర‌వించే పౌరులుగా విచార‌ణ‌కు హాజ‌రవుతాం.. విచార‌ణ‌ను ఎదుర్కొంటాం. విచార‌ణ‌ను ఎదుర్కొనే ద‌మ్ము మాకుంది. విచార‌ణ‌ను ఎదుర్కొనే ద‌మ్ము మీకుందా.. అని మోడీని అడుగుతున్నాను. ఇది రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్యే. ఈ క‌క్ష సాధింపు ప్ర‌జాకోర్టులోనే ఎదుర్కొంటాం అని కెటిఆర్ స్ప‌ష్టం చేశారు.

ఈ సందర్భంగా కెటిఆర్‌ ప్రధాని మోడీ, బిజెపి ప్రభుత్వ విధానాలపై కీలక ఆరోపణలు చేశారు. బిఆర్ఎస్‌లో 11 మంది నేతలపై దాడులు చేశారని అన్నారు. కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదని, మోడీ సమన్లు అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలపై కేసుల దాడి- జనాలపై ధరల దాడి చేయడమే ప్రధాని మోడీ లక్ష్యం అని తీవ్ర విమర్శలు చేశారు. గౌతమ్ అదానీ ఎవరి బినామీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కెటిఆర్. ముంద్రా పోర్టులో రూ. 21వేల కోట్ల డ్రగ్స్‌ దొరికితే చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. బిజెపిలో ఎవరు చేరినా కేసులు ఉండవని విమర్శించారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒత్తిడితోనే అదానీకి ప్రాజెక్టు ఇచ్చామని శ్రీలంక చెప్పిందని, దానిపై చర్యలేవని అన్నారు మంత్రి కెటిఆర్. ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ వస్తాయని, మీడియాను సైతం వదలరని విమర్శించారు మంత్రి. అదానీతో ఒప్పందం అంటే.. గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్‌ అన్నట్లే అని శ్రీలంక ప్రతినిథి చెప్పడాని ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు మంత్రి కెటిఆర్. ఆ అభియోగాలపై కేసులు ఉండవు, ప్రధాని వివరణ ఇవ్వరని విమర్శించారు. 2014 తర్వాత 95శాతం ఈడీ దాడులు విపక్షాలపైనే జరిగాయని, భారీ అవినీతికి పాల్పడుతున్న బిజెపి నేతలపై ఎందుకు దాడులు చేయడం లేదని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు.