భారత్ లో తొలి కరోనా పేషెంట్ కు మళ్లీ పాజిటివ్

కేరళలోని త్రిసూర్ వైద్యాధికారులు వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలో క‌రోనా సోకిన తొలి పేషెంట్ మ‌ళ్లీ ఆ వైర‌స్ బారిన ప‌డింది. . చైనాలోని మెడిక‌ల్ కాలేజ్‌లో చ‌దువుతున్న కేర‌ళ‌లోని త్రిసూర్‌కు చెందిన విద్యార్థిని దేశంలో తొలి క‌రోనా పేషెంట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. 2020 జనవరి 30న ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఆమె మరోసారి కరోనా బారిన పడ్డారు. ఆమెకు మరోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని కేరళలోని త్రిసూర్ వైద్యాధికారులు వెల్లడించారు.

న్యూస్ ఏజెన్సీ పీటీఐతో త్రిసూర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కేజే రీనా మాట్లాడుతూ..సదరు విద్యార్థిని మరోసారి కోవిడ్ బారిన పడ్డారని తెలిపారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ఆమెకు వచ్చింది అసింప్టొమేటిక్ అని తెలిపారు. చదువు కోసం ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో ఆమెకు కోవిడ్ టెస్టులు నిర్వహించామని చెప్పారు. ప్రస్తుతం సదరు బాధితురారు ఇంట్లో ఉన్నారని… ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.

బాధిత విద్యార్థినికి తొలిసారి కరోనా నిర్ధారణ అయినప్పుడు త్రిసూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మూడు వారాల పాటు ట్రీట్మెంట్ చేశారు. వైద్య పరీక్షల్లో రెండు సార్లు నెగిటివ్ అని తేలిన తర్వాత ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకుందని పూర్తి స్థాయిలో నిర్ధారించుకునేందుకు ఆమెకు రెండు సార్లు టెస్ట్ చేశారు. 2020 ఫిబ్రవరి 20న ఆమె ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/