రాజ్యసభ అభ్యర్థులుగా ఎన్నిక కావడంపై రేణుక , అనిల్ స్పందన

తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభకు వెళ్లబోయే ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. యూత్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్‌కు ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. ఈ ప్రకటనఫై వారిద్దరూ స్పందించారు.

కష్టపడే వారికి కాంగ్రెస్లో పదవులు దక్కుతాయని చెప్పడానికి తానే నిదర్శనమని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. పెద్దల సభకు తన లాంటి యువకుడికి అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఈ పదవి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఫలితమేనని అన్నారు. ఇక రేణుక స్పందిస్తూ.. ఈ అవకాశం ద్వారా రాష్ట్ర అభివృద్ధితో పాటు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. భద్రాద్రి రామయ్య ఆశీస్సులతో ఖమ్మం జిల్లా ఆడబిడ్డగా తనకు అవకాశం లభించిందన్నారు. కాగా రాజ్యసభ నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది.