కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఎంపీ శశిథరూర్‌..?

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఎంపీ శశిథరూర్‌ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా మలయాళ దినపత్రిక మాతృభూమిలో కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలను ప్రస్తావిస్తూ థరూర్‌ ఓ ఆర్టికల్‌ రాశారు. అందులో కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎన్నికలు స్వేచ్చగా, పారదర్శకంగా జరగాలని డిమాండ్‌ చేశారు. ఈ ఎన్నికతో పాటు పార్టీలో సీడబ్ల్యూసీ సభ్యుల ఎన్నికను నిర్వహించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

‘కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం కాంగ్రెస్ పునరుజ్జీవనానికి ఒక ప్రారంభం మాత్రమే, ఇది కాంగ్రెస్‌కు చాలా అవసరం. ఎన్నికల కోసం చాలా మంది అభ్యర్థులు ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. పార్టీ, దేశం కోసం మీ అభిప్రాయాలను తెలియజేయడం ఖచ్చితంగా ప్రజల ఆసక్తిని రేకెత్తిస్తుంది’ అని థరూర్‌ పేర్కొన్నారు.

శశిథరూర్‌ ఆలోచన ఇలా ఉంటే, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆలోచన మాత్రం మరోలా ఉంది. అధ్యక్ష ఎన్నికల బరిలో రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ను బరిలోకి దింపాలని సోనియా గాంధీ యోచిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు రాహుల్‌గాంధీ నిరాకరించారు. ఈ నేపథ్యంలో మధ్యే మార్గంగా తమ విధేయుడు అశోక్‌ గెహ్లాట్‌కు పగ్గాలు అప్పగించాలని సోనియా గాంధీ భావిస్తున్నారు.