ఒడిశా రైలు ప్రమాదం..ఐదుగురు ఉన్నతాధికారులపై రైల్వే బోర్డు వేటు

సౌత్‌ ఈస్టర్న్ రైల్వేస్‌ కు చెందిన కీలక అధికారుల బదిలీ

weeks-after-odisha-train-crash-railways-transfers-5-top-officials

న్యూఢిల్లీః ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం భారత రైల్వే చరిత్రలోనే అత్యంత పెను విషాదంగా మారింది. ఈ నెల 2న బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న ఈ విషాద ఘటనలో 292 మంది మరణించారు. దాదాపు 11 వందల మంది గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటన వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలతో సీబీఐ విచారణ నిర్వహిస్తోంది. సీబీఐ విచారణ కొనసాగుతుండగానే ప్రమాదం జరిగిన మూడు వారాల తర్వాత పలువురు అధికారులపై రైల్వే బోర్డు చర్యలు తీసుకుంది. సౌత్‌ ఈస్టర్న్ రైల్వేస్‌ కు చెందిన ఐదుగురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేసింది.

సిగ్నలింగ్‌, ఆపరేషన్స్‌, సేఫ్టీ విభాగాలను చూసే ఈ ఐదుగురిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. బదిలీ వేటు ఎదుర్కొన్న వారిలో ఖరగ్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) షుజాత్ హష్మీ, ఎస్‌ఈఆర్ జోన్ ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ పీఎం సిక్దర్, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ చందన్ అధికారి, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ డీబీ కాసర్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్‌ ఉన్నారు. ఈ మేరకు రైల్వే బోర్డు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి సాధారణ బదిలీనేనని రైల్వే బోర్డు చెబుతున్నా.. ప్రమాదం నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.