నేడు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జీ20 వర్చువల్ సదస్సు..

సదస్సులో పాల్గొననున్న రష్యా, డుమ్మా కొట్టనున్న చైనా

India to host G20 virtual summit today, China’s Xi to skip, Putin to attend

న్యూఢిల్లీ: నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన వర్చువల్ జీ20 సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో కూటమిలోని వివిధ దేశాధినేతలు పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా సదస్సులో పాల్గొంటారని ఆ దేశ అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. అయితే, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఈ సదస్సుకు డుమ్మా కొట్టనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు ఈ వర్చువల్ G20 లీడర్స్ సదస్సు జరుగుతుంది.

వర్చువల్ సమ్మిట్‌లో అనేక ప్రధానాంశాలు చర్చించబడతాయి. 2023లో గ్లోబల్ ఎకానమీ, ఫైనాన్స్, క్లైమేట్ ఎజెండా, డిజిటలైజేషన్ ఇతర అంశాలపై చర్చిస్తారు. ఈ వర్చువల్ జీ20 సమ్మిట్ ప్రధాని అధ్యక్షతన నిర్వహించనున్నట్లు జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్ అసెంబ్లీ హై-లెవల్ వీక్, SDG సమ్మిట్ 78వ సెషన్ తర్వాత ప్రపంచ నాయకుల ప్రధాన సమావేశం ఈ G20 వర్చువల్ సదస్సేనని విలేకరుల సమావేశంలో షెర్పా తెలిపారు.

ఈ సదస్సుకు ఆఫ్రికన్ యూనియన్ ఛైర్మన్‌తోపాటు మొత్తం G20 సభ్యదేశాల నాయకులు, తొమ్మిది అతిథి దేశాలు, 11 అంతర్జాతీయ సంస్థల అధిపతులు కూడా ఆహ్వానించబడ్డారు.