బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌పై కేసు నమోదు

rajasingh

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళా గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌ కు షాక్ ఇచ్చారు పోలీసులు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై మంగళ్‌హాట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 14వ తేదీన అఫ్జల్‌గంజ్‌ పరిధిలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో రాజా సింగ్ మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై ఎస్సై షేక్ అస్లాం ఫిర్యాదు చేయడంతో రాజాసింగ్​పై సెక్షన్‌ 153, 153(ఏ) ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రవి కుమార్ తెలిపారు.

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రాజాసింగ్.. ఈసారి కూడా సంచలన కామెంట్లే చేశారు. అయితే.. ప్రతిసారీ ఆయన ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై కామెంట్లు చేస్తుండగా… ఈసారి మాత్రం తన సొంత పార్టీ కార్యకర్తలపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2018 ఎన్నికలప్పుడు తనను మోసం చేసిన అందరి పేర్లు తన దగ్గరున్నాయని.. ఎన్నికల తర్వాత వాళ్ల సంగతి చూస్తానని రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను చావుకు భయపడనని.. ఎవరినైనా చంపడానికి కూడా భయపడనంటూ.. బహిరంగంగానే ధమ్కీ ఇచ్చారు రాజాసింగ్. తాను శత్రువులనే వదిలిపెట్టనని.. అలాంటిది సొంతవాళ్లే మోసం చేస్తే ఎలా వదిలిపెడతానంటూ రాజాసింగ్ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు.