తహసీల్దార్ కు రక్షణ లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏమిటి?: గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao
ganta-srinivasa-rao

అమరావతిః గంటా శ్రీనివాసరావు విశాఖలో తహసీల్దార్ రమణయ్య హత్య ఘటనపై స్పందించారు. ప్రశాంతతకు మారుపేరు విశాఖ నగరంలో ఇలాంటి ఘటన జరగడం ఆందోళనకు గురిచేస్తుందని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి పాలనలో విశాఖపట్టణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు భయపడుతున్నారని గంటా అన్నారు. గతంలో విశాఖ ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తహసీల్దార్ రమణయ్య దారుణ హత్య విశాఖ వాసులను ఉలిక్కిపాటుకు గురిచేసిందని.. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం విశాఖను నేర రాజధానిగా తయారు చేస్తోందని గంటా విమర్శించారు. ఎంపీ కిడ్నాప్ వ్యవహారంను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదని గంటా వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. విశాఖలో ప్రైవేటు వ్యక్తుల దందాలు బాగా పెరిగాయి.. భూ మాఫియా రెచ్చిపోతుంది.. ఇప్పటికైన ప్రభుత్వం దృష్టిసారించాలని గంటా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విశాఖలో నేరాలు పెరిగాయని కేంద్రం హోంశాఖ మంత్రే చెప్పారని టిడిపి నేత గంటా శ్రీనివాస్ రావు గుర్తుచేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి చిత్తశుద్ది లేదు.. తహసీల్దార్ కు రక్షణ లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏమిటని గంటా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ ను మర్డర్ చేస్తే రాష్ట్ర హోంమంత్రి ఏం చేస్తున్నారని గంటా ప్రశ్నించారు. భూమాఫియా వల్లనే తహసీల్దార్ హత్య జరిగిందని, ప్రభుత్వం పెద్దల హస్తం ఉందని మాకు సమాచారం ఉందని గంటా అన్నారు.