పంజాబ్ గవర్నర్‌గా బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా

Banwarilal Purohit Resigns As Punjab Governor, Cites

చండీగఢ్: పంజాబ్‌ గవర్నర్‌ పదవికి భన్వరీలాల్‌ పురోహిత్‌ శనివారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామాను పంపారు. రాజీనామాను ఆమోదించాలని ఆయన రాష్ట్రపతిని కోరారు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌ బాధ్యతలకు సైతం ఆయన రాజీనామా చేశారు. భన్వరీలాల్ పురోహిత్ పంజాబ్ గవర్నర్‌గా 2021 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు. 2017 నుండి 2021 వరకు తమిళనాడు గవర్నర్‌గా ఉన్నారు.

2016 నుంచి 2017 వరకు అసోం గవర్నర్‌గా పని చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ నేత. ఆయన నాగ్‌పూర్ నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. పురోహిత్ 1940 ఏప్రిల్ 16న రాజస్థాన్‌లో జన్మించారు. పంజాబ్‌లో పని చేసిన కాలంలో వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా భగవంత్ మాన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయనకు, సీఎంకు మధ్య సంబంధాల్లో దిగజారాయి. పంజాబ్ అసెంబ్లీ సమావేశంలో విషయంలో ఇరువురి మధ్య వివాదం పెరిగి, ఈ అంశం సుప్రీంకోర్టు వరకు చేరింది. వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని సమాధానం ఇవ్వాలని తరచూ డిమాండ్‌ చేస్తూ వచ్చారు.

అక్టోబర్‌లో పంజాబ్ అసెంబ్లీ సెషన్‌లో ఆమోదించిన మూడు బిల్లులను ఆమోదించడానికి ఆయన నిరాకరించారు. దీనికి నిరసనగా సీఎం భగవంత్ మాన్ సహా ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనపై విమర్శలు గుప్పించింది. సీఎం భగవంత్ మాన్ శుక్రవారం సైతం గవర్నర్‌ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ మమ్మల్ని వేధిస్తున్నారని ఆరోపించారు. ఇది సక్రమం కాదని, చట్ట విరుద్ధమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలచేత ఎన్నుకోబడి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని.. చాలా మంది ప్రజలు ఎంచుకున్న నియమాలను అలవాటు చేసుకున్నారని విమర్శించారు.