త‌న‌ను బంధించిన గ‌దిని శుభ్రం చేసుకున్న ప్రియాంక

పీఏసీ గెస్ట్ హౌస్ లో పోలీసుల అదుపులో ఉన్న ప్రియాంక
శుభ్రంగా ఉన్న గదిని కూడా ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ఫైర్


సీతాపూర్‌: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. ఆమెను సీతాపూర్ లోని స్టేట్ పీఏసీ గెస్ట్ హైస్ లో ఉంచారు. ఈ గెస్ట్ హౌస్ లోని గదిని ఆమె ఊడుస్తుండగా తీసిన వీడియోను పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన కాంగ్రెస్ శ్రేణులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంకకు పరిశుభ్రంగా ఉన్న గదిని కూడా ఇవ్వలేదంటూ మండిపడుతున్నారు. స్వచ్ఛ భారత్ అంటే ఇదేనా? అని ఒక కాంగ్రెస్ నేత బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. శుభ్రంగా లేని గదిని ఇచ్చినప్పటికీ… ప్రియాంక ఏ మాత్రం భేషజాలకు పోకుండా గదిని తనకు తానే శుభ్రం చేసుకున్నారని కొనియాడారు.

ఆమె అరెస్టును నిర‌సిస్తూ ఆందోళ‌న‌కారులు ఆ గెస్ట్ హౌజ్ ముందు ధ‌ర్నా చేప‌ట్టారు. ప్రియాంకా గాంధీ, దీపేంద‌ర్ హూడాల‌పై పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును కాంగ్రెస్ ఖండించింది. సీతాపూర్‌లో త‌న కాన్వాయ్‌ను అడ్డుకున్న స‌మ‌యంలో ప్రియాంకా గాంధీ పోలీసుల‌పై తిర‌గ‌బ‌డ్డారు. త‌న అరెస్టు వారెంట్ చూపించాలంటూ ఆమె డిమాండ్ చేశారు.

నిన్న నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల పైనుంచి బీజేపీ శ్రేణులకు చెందిన కార్లు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంక వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని పీఏసీ గెస్ట్ హౌస్ కు తరలించారు.

https://twitter.com/scribe_prashant/status/1444910882891321345

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/