ఏఐసీసీ అధ్యక్ష పదవికి నేడు దిగ్విజయ్‌ సింగ్ నామినేషన్‌

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రోజు రోజుకు అనేక మలుపులు తిరుగుతున్నాయి. మొన్నటివరకు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. కానీ రాజస్థాన్ రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో అంతా తలకిందులయింది. దీంతో దిగ్విజయ్‌ సింగ్ బరిలోకి వచ్చేలాచేసింది.

దిగ్విజయ్‌ ఈరోజు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. మరోపక్క సీనియర్ నేత శశి థరూర్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దీనిపై ఇది వరకే ఆయన క్లారిటీ ఇచ్చారు. అటు మల్లిఖార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ కూడా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. నిన్న సోనియా గాంధీతో ఏకే ఆంటోని సమావేశమయ్యారు. ఒకవేళ కాంగ్రెస్ ఎన్నికల బరిలో దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ ఇద్దరే ఉంటే.. సోనియా గాంధీ మద్దతు దిగ్విజయ్ సింగ్‌కే ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.