నేడు ఢిల్లీలో సీడ‌బ్ల్యూసీ స‌మావేశం..లోక్ సభ అభ్యర్థుల ప్రకటన

ఢిల్లీలో సీడ‌బ్ల్యూసీ స‌మావేశం జరగబోతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. కాంగ్రెస్ ఈ మీటింగ్‌లో ఎన్నికల మేనిఫెస్టోకు ఆమోదం తెలపనుంది. ఇక, సీడబ్ల్యూసీ మీటింగ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణలో 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే చాన్స్ ఉంది.

గెలుపే ప్రధానమన్న లక్ష్యంతో 13 లోకసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సామాజిక సమతుల్యత పాటిస్తూనే విజయం సాదించ గలిగే ప్రజాబలం కలిగిన వారికే టికెట్లు ఇచ్చే దిశలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ముందుకు వెళుతుంది. జనాదరణ కలిగిన నాయకులనే బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇవాళ సాయంత్రం దిల్లీలో జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీ రాష్ట్రానికి చెందిన లోకసభ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఏఐసీసీ ప్రకటించనున్న నాలుగో జాబితాలో తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.