ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ

ED to produce BRS leader Kavitha before Delhi court

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ క‌విత అరెస్టు అవ్వ‌డంపై సుఖేశ్‌చంద్ర‌శేఖ‌ర్ స్పందించారు. మంగళవారం ఉదయం జైలు నుంచి మరో లేఖ విడుదల చేశారు. ‘కవిత అక్కయ్య’లిక్కర్ కుంభకోణం కేసులో నిజం రుజువైంది. బూటకపు కేసులని.. రాజకీయ ప్రతీకారమని.. ఇన్నాళ్లూ నువ్వు చేసిన వాదన అబద్ధమని రుజువైందంటూ లేఖ‌లో పేర్కొన్నారు.

మీ పార్టీ వేలకోట్లను సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచింది. నెయ్యి డబ్బాలంటూ మీరు కథలపై దర్యాప్తు జరుగుతోంది’ అని లేఖలో సుఖేశ్ పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సుఖేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైలులో ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై అనేకసార్లు సంచలన ఆరోపణలు చేశారు. కవితతో తాను చేసిన వాట్సాప్‌ చాట్‌తో పాటు అనేక స్క్రీన్ షాట్స్ విడుదల చేసి పొలిటికల్ హీట్ పెంచారు. తాజాగా.. మరోసారి సుఖేశ్ కవిత అరెస్ట్‌పై స్పందించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటె కవిత తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విషయం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేశారంటూ పిటిషన్‌లో ప్రస్తావించారు కవిత. గతంలో విచారణ సందర్భంగా నోటీసులు జారీ చేయబోమని చెప్పిన ఈడీ అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్‌లో తెలిపారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఈడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే కేసులో ఈడీ తనపై బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని.. మహిళలను దర్యాప్తు కార్యాలయాలకు పిలిచి విచారణ చేయకుండా ఇంటి వద్దనే విచారించాలని గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. ఈ రెండు పిటిషన్లను కలిపి ఇవాళ‌ విచారించనుంది.