చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు

చంద్రబాబు కాంగ్రెస్ పెద్దల్ని కొనిపడేసి తెలంగాణాలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నారు.. విజయసాయిరెడ్డి

అమరావతి: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక పొలిటికల్ బ్రోకర్ అని అన్నారు. పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కొనిపడేసి, తన శిష్యుడు రేవంత్ కు అధ్యక్ష పీఠాన్ని ఇప్పించుకున్నారని అన్నారు. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ను డైరెక్ట్ గా తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నారని అన్నారు.

కేసుల నుంచి రక్షణ కోసం నలుగురు ఎంపీలకు చంద్రబాబు బీజేపీ తీర్థం ఇప్పించారని విజయసాయి విమర్శించారు. ‘మనవాళ్లు బ్రీఫుడ్ మీ’ కేసు ఎప్పటికీ తేలకుండా తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని గులాబి పార్టీలోకి చొప్పించారని ఆరోపించారు. పచ్చ రక్తం నరనరాల్లో ప్రవహించే కరడు కట్టిన ముఖ్యులను ముందుగానే కాంగ్రెస్ లోకి తోలారని అన్నారు. ‘బాబా మజాకా!’ అంటూ ఎద్దేవా చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/