పవన్ కళ్యాణ్‌పై కేసులు నమోదు చేయడం పట్ల మండిపడుతున్న జన సైనికులు

ఏపీలో వాలంటీర్ల అంశం ఇప్పుడు కాకరేపుతుంది. వాలంటీర్లలో కొంతమంది అన్యాయాలకు పాల్పడుతున్నారని , ఒంటరి మహిళలను బెదిరించి లొంగదీసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లతో కలిసి వైస్సార్సీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. విజయవాడ సచివాలయంలో పనిచేస్తున్న దిగమంటి సురేష్ బాబు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పవన్‌పై సెక్షన్ 153, 153ఏ, 505 (2) ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులు నమోదు చేయడం పట్ల జనసేన శ్రేణులు మండిపడుతున్నారు.

పవన్ చెప్పింది ఒకటైతే..వైస్సార్సీపీ శ్రేణులు ప్రచారం చేస్తుంది మరోటి అని , వాలంటీర్లలో కొంతమందిని మాత్రమే పవన్ అన్నాడని , కానీ అది వారు అర్ధం చేసుకోకుండా వైస్సార్సీపీ నేతలు ఎంచెపితే అది చేస్తున్నారని జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో జనసైనికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ.. రాజకీయ దుర్బుద్ధితోనే పవన్ కళ్యాణ్‌పై విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారన్నారు. నగర పోలీస్ కమిషనర్ దీనిపై వెంటనే స్పందించి ప్రకటన చేయాలన్నారు. మిస్సింగ్ కేసులపై తమ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమాధానం చెప్పకుండా పిరికిపంద చర్యలా పోలీస్ కేసులను నమోదు చేశారని విమర్శించారు. ఈ నియంత పరిపాలనను వ్యతిరేకిస్తూ ఆందోళన తీవ్రతరం చేస్తామని పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు.