తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా అధికార పార్టీ తో పాటు కాంగ్రెస్ , BSP , CPM తదితర పార్టీలు తమ మేనిఫెస్టో లను ఇప్పటికే ప్రకటించి ఎన్నికల ప్రచారం చేస్తుండగా..బిజెపి కాస్త ఆలస్యంగా విడుదల చేసింది.

నేడు శనివారం కేంద్ర మంత్రి అమిత్ షా..హైదరాబాద్ లో ‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ’ పేరుతో బీజేపీ మేనిఫెస్టో ను రిలీజ్ చేశారు. ప్రధానంగా 10 అంశాల కార్యాచరణతో దీన్ని రూపొందించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులకు మేలు చేకూరేలా పలు హామీలను పొందు పరిచారు. అలాగే బీసీని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించారు.

మేనిఫెస్టో అంశాలు చూస్తే..

‘ధరణి’కి బదులు ‘మీ భూమి’ యాప్, ప్రజలందరికీ సమర్థమంతమైన, సుపరిపాలన
బీసీని తెలంగాణ తొలి సీఎంగా చేయడం
పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా 1న వేతనాలు, పింఛన్లు
గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక నోడల్ ఏజెన్సీ, మత రిజర్వేషన్లు తొలగించి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెంపు
ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ ఏర్పాటు
డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థినులకు ఉచిత ల్యాప్ టాప్స్, ఉజ్జ్వల లబ్ధిదారులకు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు
మహిళా రైతుల కోసం మహిళా కార్పొరేషన్ ఏర్పాటు, మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు, స్వయం సహాయక బృందాలకు నామమాత్రపు 1 శాతం వడ్డీకే రుణాలు.
UPSC తరహాలోనే 6 నెలలకోసారి TSPSC ద్వారా ఉద్యోగాల భర్తీ, గ్రూప్ – 1, 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహణ, EWS కోటా, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు 6 నెలల్లో భర్తీ చేస్తామని హామీ.
వయో వృద్ధులకు ఉచితంగా కాశీ, అయోధ్య యాత్ర, జాతీయ స్థాయిలో మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర నిర్వహణ.
సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం, బైరాన్పల్లి, పరకాల ఊచకోతను స్మరించుకుంటూ ఆగస్ట్ 27న ‘రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ దినం’ నిర్వహణ.
రైతులకు ఎరువుల సబ్సిడీతో (ఎకరాకు రూ.18 వేలు) పాటు రూ.2,500 ఇన్ పుట్ అసిస్టెన్స్, పీఎం ఫసల్ బీమా యోజన కింద రైతులకు ఉచిత పంట బీమా
వరికి రూ.3,100 మద్దతు ధర, పసుపు మార్కెట్ కోసం ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు, ఆసక్తి గల రైతులకు ఉచితంగా దేశీ ఆవుల పంపిణీ
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏడాదికి రూ.10 లక్షల ఉచిత ఆరోగ్య కవరేజీ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఏడాదికోసారి ఉచిత వైద్య పరీక్షలు. జిల్లా స్థాయిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు ప్రోత్సాహం.
పోలీసులు, హోంగార్డులు, కాలేజీ విద్యార్థులు, ఇతర వాలంటీర్లకు సీపీఆర్ శిక్షణ.
రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు, కొత్త రేషన్ కార్డుల మంజూరు. అందరికీ కొత్త ఇల్లు ఉండేలా చర్యలు
ఆహార ధాన్యాల అక్రమ రవాణా నివారించి, నాణ్యమైన రేషన్ పేదలకు అందేలా పారదర్శక వ్యవస్థ ఏర్పాటు.
నిజామాబాద్ ను టర్మరిక్ సిటీగా అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు
మండల కేంద్రాల్లో నోడల్ స్కూళ్ల ఏర్పాటు, బడ్జెట్ స్కూళ్లకు పన్ను మినహాయింపు, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల విధానంపై పర్యవేక్షణ
ఆడబిడ్డ భరోసా కింద నవజాత బాలికకు బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్, 21 ఏళ్లు వచ్చే నాటికి రూ.2 లక్షలు అందజేత
సింగరేణి ఉద్యోగులకు ఆదాయ పన్ను రీయింబర్స్ మెంట్, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ.
న్యాయవాదులపై దాడుల నిరోధానికి ‘లాయర్ల రక్షణ చట్టం’
హైదరాబాద్ – విజయవాడ పారిశ్రామిక కారిడార్ ప్రారంభానికి చొరవ, హైదరాబాద్ లో రవాణా, పారిశుద్ధ్యం, ముంపు, రోడ్లు, ట్రాఫిక్ తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు.
కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి సమీక్ష