కూకట్ పల్లి లో పవన్ కళ్యాణ్ ప్రచారం

మొత్తానికి తెలంగాణ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు. తెలంగాణ ఎన్నికల బరిలో బిజెపి తో కలిసి జనసేన బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 8 స్థానాలలో జనసేన పోటీ చేస్తుంది. కూకట్‌పల్లి – ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు – నేమూరి శంకర్ గౌడ్, కోదాడ – మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు – వంగ లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం – మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం – లక్కినేని సురేందర్ రావు, వైరా (ఎస్టీ) – డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్, అశ్వారావుపేట (ఎస్టీ) – ముయబోయిన ఉమాదేవి లు పోటీ చేస్తున్నారు. వీరంతా గత కొద్దీ రోజులుగా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే తమ అధినేత పవన్ ఒక్కసారైనా ప్రచారంలో పాల్గొంటే బాగుంటుందనే భావనలో ఉన్నారు.

ఈ క్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 26న కూకట్‌పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శనివారం కూకట్‌పల్లిలో జనసేన ఐటీ మిత్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… 26న పవన్ కూకట్‌పల్లిలో ప్రచారం చేస్తారని, ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి సీట్ల కోసం అడిగామని, కానీ అనుకోని కారణాల వల్ల శేరిలింగంపల్లి వదులుకోవాల్సి వచ్చిందన్నారు. మరి కేవలం కూకట్ పల్లి లో మాత్రమే ప్రచారం చేస్తారా..మిగతా చోట్ల కూడా ప్రచారం చేస్తారా నేది చూడాలి.