మద్య నిషేధం హామీ నవరత్నాల్లో ఒక రత్నమని ప్రజల్ని నమ్మించాడుః అచ్చెన్నాయుడు

రత్నాన్ని రాయిగా మార్చి మహిళలపైకి విసిరాడని వ్యాఖ్యలు

atchannaidu press meet

అమరావతిః మేనిఫెస్టో బైబిల్ అన్నాడు, మేనిఫెస్టో ఖురాన్ అన్నాడు… మద్యనిషేధ హామీని తుంగలో తొక్కాడు… నవరత్నాల్లో ఒక రత్నమని ప్రజల్ని నమ్మించి… ఆ రత్నం ద్వారానే నాలుగేళ్లలో తన ఖజానాకు లక్ష కోట్లు తరలించాడంటూ సీఎం జగన్ పై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో మరోసారి మద్యం ధరలు పెంచిన నేపథ్యంలో అచ్చెన్నాయుడు మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అధికారంలోకి వచ్చాక జగన్ 30 శాతం హామీలు కూడా నెరవేర్చలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. నవరత్నాల్లో ఒకటన్న మద్యనిషేధ హామీని జగన్ రెడ్డి రాయిగా మార్చి మహిళల జీవితాలపైకి విసిరాడని మండిపడ్డారు. మద్య నిషేధంలో భాగంగా జగన్ మద్యం ధరలు పెంచడంలేదు… తన దోపిడీ కోసం పెంచుతున్నాడని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

రాష్ట్రంలో మద్య నిషేధం జరిగితే… 2020-21తో పోలిస్తే మద్యం అమ్మకాలు ఎందుకు పెరిగాయో జగన్ చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో మద్యం అమ్మకాలపై రూ.50 వేల కోట్లు వస్తే… జగన్ నాలుగేళ్ల పాలనలో రూ.2.10 లక్షల కోట్లు వచ్చాయని వివరించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మద్యంపై వచ్చే ఆదాయాన్ని 15 ఏళ్లు తాకట్టు పెట్టి రూ.30 వేల కోట్లు అప్పు తెచ్చిన అసమర్థుడు జగన్ రెడ్డి అని అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు అన్నింటికీ కర్త కర్మ క్రియ జగన్ రెడ్డేనని అన్నారు. తన పార్టీ వారితో నాసిరకం మద్యం తయారు చేయిస్తూ, దాన్నే అధిక ధరకు అమ్ముతూ, నాలుగేళ్లలో 35 వేల మంది పేదల ప్రాణాలు తీశాడని మండిపడ్డారు. రాష్ట్రంలో 35 లక్షలకు పైగా మందుబాబులు జగన్ కల్తీమద్యం దెబ్బతో వివిధ అనారోగ్య సమస్యలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని వెల్లడించారు.

“జగన్ నోరు పెద్ద అబద్ధాల పుట్ట. నోరు తెరిస్తే జగన్ రెడ్డి నా ఎస్సీ… నా ఎస్టీ..,, నా బీసీ.., నా మైనారిటీలు అంటాడు. తన కల్తీ మద్యానికి వారినే ఎక్కువగా బలిచేస్తున్నాడు. జగన్ రెడ్డి కల్తీ మద్యానికి ఎక్కువగా బలైపోతున్న వారిలో దళితులే ముందు వరుసలో ఉన్నారు. నిత్యం రెక్కల కష్టం చేయడం… వచ్చిన అరకొర సొమ్ములో తమ కష్టం తాలూకు బాధను మర్చిపోవడానికి మద్యం సేవించడం అనేది అందరూ చేసేదే. అలా రెక్కాడితే గానీ డొక్కాడని 35 వేల మందిని తన నాలుగేళ్ల పాలనలో జగన్ రెడ్డి కల్తీ మద్యంతో బలి తీసుకున్నాడు. జగన్ రాష్ట్రంలో అమ్ముతున్న మద్యం విషం కంటే ప్రమాదకరమైందని ఇప్పటికే తేలింది. టిడిపి నేతలు గతంలో పరిశోధనశాలల్లో పరీక్షించి మరీ జే బ్రాండ్ మద్యంలోని హానికారక రసాయనాల గుట్టుమట్లను ప్రజల ముందు ఉంచారు. అలాంటి మద్యం అమ్ముతూ..పేదల జీవితాలు తన ధనదాహానికి బలిచేస్తూ.. జగన్ రెడ్డి తన ఖజానా నింపుకుంటున్నాడు” అని తీవ్ర విమర్శలు చేశారు.

“టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్ రెడ్డి నాలుగేళ్లలో సాగించిన మద్యం దోపీడీపై న్యాయవిచారణ జరిపిస్తుంది. కల్తీమద్యం అమ్మకాలు నిషేధించి… నాణ్యమైన మద్యం తక్కువ ధరకు లభించేలా చూస్తాం” అని స్పష్టం చేశారు. కాగా, గతంలో జగన్ మద్య నిషేధం అంశంపై చేసిన ప్రసంగాలను అచ్చెన్నాయుడు ఈ మీడియా సమావేశంలో ప్రదర్శించారు.